సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఏపీ ఫిల్మ్ ఛాంబర్ సొంత టీవీ ఛానల్ ను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉందని సమాచారం. టాలీవుడ్ ప్రారంభోత్సవాలు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇలా పూర్తిగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమాచారంతో ఈ టీవీ ఛానల్ రన్ కానుందని తెలుస్తోంది. కొత్త సినిమాల విడుదల సందర్భంగా బోలెడు ప్రకటనలు, ఇతర వాణిజ్య ఉత్పత్తుల ప్రకటనలు వస్తాయి కాబట్టి నిర్వహణ పరంగా కూడా ఎలాంటి భారం ఉండదని, తద్వారా వచ్చే లాభాలతో ఫిల్మ్ ఛాంబర్‌ను మరింత అభివృద్ధి పరచవచ్చనే ఆలోచన కూడా ఉందని చర్చించుకుంటున్నారు.
తెలుగు న్యూస్ ఛానల్స్ మధ్య పోటీ పెరిగి సినీ పరిశ్రమ పట్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, లేని పోని వార్తలు సృష్టించి ప్రేక్షకుల్లో గంధరగోళానికి కారణం అవుతున్న నేపథ్యంలో సదరు ఛానళ్లపై బ్యాన్ విధించి, మాటీవీ, జీ తెలుగు వంటి ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్‌తో మాత్రమే కనెక్ట్ కావాలని నిర్ణయించారు. అయితే ఇలా చేయడం అసాధ్యమైన వ్యవహారం కావడం, కొన్ని చిక్కులు ఉన్న నేపథ్యంలో నేరుగా సొంత ఛానల్‌ను లాంచ్ చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అనేక గ్రూపులు, ముఠాలు, చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు...మధ్య విబేధాలు ఉన్న నేపథ్యంలో టీవీ ఛానల్‌ను ప్రారంభించడం, ఆపై సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమేనా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ టీవీ ఛానల్ ఏర్పాటు యోచన కార్యాచరణలోకి వస్తుందో లేదో మరికొన్ని రోజులు ఆగితే గానీ చెప్పలేం.
Post a Comment